యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ ఫిర్యాదు.. నోరు మూసుకుని కూర్చోలేనని వ్యాఖ్య
- వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోనన్న విష్ణుప్రియ
- యూట్యూబ్ ఛానల్ పై మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు
- కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళతామని హెచ్చరిక
సోషల్ మీడియాలో నటీనటుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసభ్యకరమైన కంటెంట్ పెట్టే వారిపై యాంకర్, నటి విష్ణుప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ‘ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ కంప్లైంట్‌తో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ... సదరు ఛానల్ నడిపే వ్యక్తి ఒక అమ్మాయి అయ్యుండి కూడా, సెలబ్రిటీ మహిళల క్యారెక్టర్‌ను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. తాము ఇండస్ట్రీకి వచ్చింది ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికని, నిజంగా తప్పు చేసినప్పుడు విమర్శిస్తే తలదించుకుని ఒప్పుకుంటామని అన్నారు. కానీ, డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది అంటూ అసత్య ఆరోపణలు చేస్తుంటే ఇంకా నోరు మూసుకుని కూర్చోలేనని, అందుకే తనతో పాటు ఇండస్ట్రీలోని ఆడపిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి ఒక ఛానల్‌పై చర్యలు ప్రారంభించామని, ఇకపై ఎవరు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్‌ను ప్రొజెక్ట్ చేసినా వారి యూట్యూబ్ ఛానల్స్‌పై స్ట్రైక్స్ పడేలా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళతామని విష్ణుప్రియ హెచ్చరించారు.